Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత మత విధానాలను చాలెంజ్ చేసిన ముస్లిం యువతి... బంతిని కేంద్రం ముందుకు నెట్టిన సుప్రీం

ముస్లిం వ్యక్తిగత చట్టాలు ఎంతమాత్రమూ సమంజసం కాదని, అవి భారత రాజ్యాంగ విరుద్ధమని షాయారా బానూ అనే యువతి వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఏం చేయాలో సూచించమని నరేంద్ర మోదీ సర్కారును ప్రశ్నించింది. ముస్లిం మతంలో అమలవుతున్న 'తలాక్- ఏ-బిదత్' (మూడుసార్లు తలాక్ అంటే విడాకులు), నిఖా హలలా, బహుభార్యత్వం తదితరాలు రాజ్యాగంలోని 14, 15, 21 ఆర్టికల్స్ ఉల్లంఘనేనని షాయారా ఆరోపించింది. తన భర్త చేస్తున్న గృహ హింసను ప్రశ్నించినందుకు తనకు మూడుసార్లు 'తలాక్' అని చెప్పి విడాకులు ఇచ్చేసినట్టు ప్రకటించాడని, ఇదెలా కుదురుతుందని ఆమె సుప్రీంకోర్టును ప్రశ్నించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిల్ ఆర్ దావే, ఏకే గోయల్ లతో కూడిన ధర్మాసనం, మత విశ్వాసాలతో కూడుకున్న ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై కేంద్రాన్ని కల్పించుకోవాలని కోరింది. "ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాలో చట్టాలు మారాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను" అని ఈ సందర్భంగా షాయారా వ్యాఖ్యానించింది. కాగా, ఇప్పటికే ఎందరో రీసెర్చ్ స్కాలర్లు, పవిత్ర ఖురాన్ లో ఎక్కడా 'తలాక్-ఏ-బిదత్' ప్రస్తావన లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News